నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సకల సన్నాహాలు పూర్తిచేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఆధ్యాత్మిక, సాంస్క్రతిక, మతపరమయిన సంప్రదాయాలకు పుష్కరాలు అద్దంపడతాయి. వయసుతో సంబంధం లేకుండా అంతా జనమంతా మహాగోదావరి పుష్కరాల్లో పాల్గొని పునీతలవుతారు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలు మన వారసత్వ విలువలను ప్రతిబింబిస్తాయి. ఉత్తర భారత దేశంలో జరిగే కుంభమేళాకు ఏమాత్రం తీసిపోని విధంగా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నారు. ఈ గోదావరి పుష్కరాల్లో 3 కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారు. దీంతో పాటు తమ పూర్వీకులకు పిండ ప్రదాన, తర్పణ క్రియలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల్లో ఉభయగోదావరి జిల్లాలు జనసంద్రంగా మారనున్నాయి. వీటన్నిటికీ అలనాటి రాజమహేంద్రవరం కేంద్రస్థానమై భాసిల్లనుంది.
12 ఏళ్ళకోసారి వచ్చే పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేసింది నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కలకలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా పుష్కర ఏర్నాట్లు చేపట్టింది మన ప్రభుత్వం. 2003 లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోనే అప్పుడూ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది. మళ్ళీ అదే స్ఫూర్తితో ప్రభుత్వంలోని అన్నివిభాగాలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు జాతి ఔన్నత్యాన్ని, విశిష్టతను చాటేలా ఈ పుష్కర ఏర్పాట్లను చేపడుతున్నారు. వందల సంవత్సరాల మన తెలుగు జాతి విశిష్టతను ఈ పుష్కరాలు ప్రతిబింబించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ప్రభుత్వ విభాగాలను అన్నిటినీ ఈ పుష్కర పనుల్లో భాగస్వామ్యం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. కోట్లాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంతా సమన్వయంతో తమ ఇంటిలో జరిగే శుభకార్యంలా పుష్కర ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు.
గోదావరి మహా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1470 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. పుష్కర ఘాట్లు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని వివిధ దేవాలయాల పునరుద్దరణ, పుష్కర ఘాట్లను కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రాజమండ్రి, నరసాపురం, కొవ్వూరుల్లో పుష్కరాలకు సకల ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి పుష్కరాలకు కోట్లాదిమంది తరలిరానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీలేనివిధంగా ఏర్పాట్లు చేసింది. పుష్కరాల సందర్భంగా జూలై 14 నుంచి 25 వరకూ గోదావరి ప్రవహించే జిల్లాల్లో భక్తులు, పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుందని అంచనా వేశారు. గోదావరి పుష్కరాల్లో మన సంస్క్రతికి అద్దం పట్టేలా జానపద కళారూపాలను ప్రదర్శించేందుకు సకల ఏర్పాట్లు చేసింది.
గోదావరి పుష్కరాల కమిటీ ఛైర్మన్ పరకాల ప్రభాకర్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 12 రోజుల పుష్కరాలు మన సాంస్క్రతిక వైభవాన్ని చాటేలా సకల సన్నాహాలు చేశామని చెబుతున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 25 లక్షల మంది భక్తులు గోదావరి పుష్కరాలకు తరలి వస్తారని అంచనా వేశారు. పుష్కర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి కె.ధనంజయరెడ్డి. ప్రభుత్వం పుష్కరాల కోసం సుమారు 15 వందల కోట్ల రూపాయలు కేటాయించిందని, ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు ధనంజయరెడ్డి. ప్రిన్సిపల్ సెక్రటర జెఎస్వీ ప్రసాద్, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ పుష్కర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. పిండ ప్రదానాలు, తీర్థ విధులు సక్రమంగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాల్లో పిండ ప్రదానాలు, ఇతర మతపరమయిన సంప్రదాయ కార్యక్రమాల కోసం 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ నిర్మాణాలు చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 41 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేశారు. పిండ ప్రదానాల కోసం కనీస రేట్లను నిర్దారించింది ప్రభుత్వం. ప్రతి పూజారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుర్తింపుకార్డులు అందచేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువగా వసూలుచేసవారిని తేలికగా గుర్తించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.
సుందరంగా మారిన రాజమండ్రి
గోదావరి పుష్కరాలకు కేంద్ర స్థానంగా, ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తున్న రాజమండ్రిపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాజమండ్రి విమానాశ్రయం నుంచి గోదావరి పుష్కర ఘాట్ల వరకూ ప్రధాన రహదారిని సుందరంగా తీర్చదిద్దింది. నాలుగులేన్ల రహదారిగా అభివృద్ధి చేసింది.వేలాదిమంది కార్మికులు, కాంట్రాక్టర్లు, అధికారులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇరవై నాలుగుగంటల పాటు వివిధ యంత్రాలతో పనులు నిర్వహిస్తున్నారు. వీవీఐపీల కోసం 176 అడుగుల పొడవైన సరస్వతి ఘాట్ నిర్మించారు. మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వీవీఐపీల కు సకల ఏర్పాట్లు చేశారు. అలాగే నాలుగు కోట్లతో సరస్వతి దేవాలయం నిర్మించారు. 94 కోట్లతో 250 స్నానఘట్టాలు నిర్మించారు. ఈ ఘాట్లు 5 మీటర్ల నుంచి 12 వందల మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు.
ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
పుష్కరాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ 1500 ప్రత్యేకబస్సులను ఏర్పాటుచేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. వీటికి తోడు రాజమండ్రి నగరంలో మరో 300 బస్సులు అందుబాటులో ఉంచారు. ఈ బస్సుల్లో భక్తులు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే పుష్కర ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్ళతో పాటు బుకింగ్ కౌంటర్ల సంఖ్యను కూడా పెంచింది. పుష్కర ఘాట్లను సులువుగా చేరుకుని, పుష్కర స్నానాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు. వృద్ధులు, చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటుచేశారు. బ్యాటరీలతో నడిచే గోల్ప్ కార్లను ఇందుకోసం వినియోగిస్తున్నారు.
నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్ డాక్యుమెంటరీ
గోదావరి పుష్కరాలపై నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. గోదావరి పుష్కరాల విశిష్టతను తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. గోదావరి పుష్కరాల విశిష్టతను అందరికీ తెలియచేసేందుకు సోషల్ వెబ్ సైట్లను కూడా బాగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి పుష్కరాలు ప్రారంభ మయ్యేవరకూ ప్రతిరోజూ గోదావరి హారతి నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా గోదావరి హారతి నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
ఫొటో గ్రఫీ పోటీలు
ది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జీహెచ్హెచ్ఎఫ్) ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలపై ఫోటో గ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నారు. జూలై 14 నుంచి 25 వరకూ పుష్కరాలకు సంబంధించిన ఫోటోలు తీసినవారికి మూడు బహుమతులు అందచేయనున్నారు. మొదటి ఉత్తమ ఫోటోకి రూ.50వేలు, ద్వితీయ ఉత్తమ ఫోటోకి 30 వేలు, తృతీయ ఉత్తమ ఫోటోకి రూ. 25వేలు అందచేస్తారు. అలాగే రూ.5 వేల చొప్పున ప్రత్యేక బహుమతులు కూడా ఉన్నాయి. గోదావరి నది విశిష్టత, భక్తుల కార్యకలాపాలు, దేవాలయాలు, పుష్కర ఘాట్లు, ఏర్పాట్లను ఫోటోలు ప్రతిబింబించేలా ఉండాలి,
గోదావరి జలం
గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు పుష్కర జలాన్ని తమ తమ స్వస్థలాలకు తీసుకువెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు భక్తులు 500 మిల్లీలీటర్ల గోదావరి పవిత్ర జలాలను రూ.20 పెట్టి కొనుగోలు చేసి తీసుకు వెళ్ళవచ్చు. పోస్టల్ డిపార్ట్ మెంటు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసింది. గోదావరి జలం నింపిన 20 లక్షల బాటిళ్ళను సిద్దం చేశామని, భక్తుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు వాటిని మరింత పెంచుతామని ఏపీ, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ చెబుతున్నారు. రాజమండ్రికి చెందిన సాఫైర్ బాట్లింగ్ కంపెనీ ఆర్వో టెక్నాలజీతో 18 పద్ధతుల్లో శుద్ధిచేసిన మంచినీటిని బాటిళ్ళ ద్వారా అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 16, 150 పోస్ట్ ఆఫీసుల ద్వారా గోదావరి జల్ బాటిళ్ళను కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ ద్వారా కూడా పవిత్ర జలాలను దేశంలోని ఏ ప్రాంతం వారైన తెప్పించుకోవచ్చు. www.appost.in/eshop ద్వారా ఈ సదుపాయం పొందే వీలుంది.
గోదావరి పుష్కరాల కోసం దక్షిణ మధ్య రైల్వేవారు సకల ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి గోదావరి నది ప్రవహించే అన్ని ప్రాంతాలకు రైళ్ళు నడుపుతున్నారు. ఇప్పటికే ఈ రైళ్ళకు సంబంధించిన బుకింగ్ లు పూర్తయ్యాయి. అవసరాన్ని బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామటున్నారు అధికారులు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి కూడా ప్రత్యేక విమాన సర్వీసులు నిర్వహిస్తున్నారు. జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ కంపెనీలు ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేశాయి.