గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్ళకు ఒక్కసారి వస్తాయి. ఈసారి వచ్చిన పుష్కరాలకు ఎంతో విశిష్టత ఉంది. బృహస్పతి సింహరాశి లోకి ప్రవేశించినపుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ కి ఎంతో ముఖ్యమయినవి. ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు ఎంతటి ప్రాధాన్యత ఉందో మన గోదావరి పుష్కరాలకు అంతటి విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు.గోదావరి పుష్కరాలు ఉల్లాసపూరిత వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి.

ఆషాడ మాసంలోని చతుర్దశి నాడు పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఈసారి వచ్చిన పుష్కరాలు సాధారణమయినవి కావు. మహా పుష్కరాలు. ప్రతి 12 పుష్కరాలకు ఒకసారి మహా పుష్కరం వస్తుంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరంలో మనం పాల్గొనడం మన పూర్వజన్మ ఫలంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ మహా పుష్కరం చూసే భాగ్యం మనలో ఎవరికీ కలగకపోవచ్చు.

ఎందుకంటే 2159 లో వచ్చే మహా పుష్కరం అది. దీన్ని బట్టి ఈ మహా పుష్కరాలకు ఎంతటి ప్రాధాన్యత, విశిష్టత ఉందో అర్థం చేసుకోవచ్చు. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

గోదావరి నది

గోదావరి నది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకంలో పుట్టింది. పశ్చిమ కనుమల్లో పుట్టిన ఈ గోదావరి నదికి ఎంతో పవిత్రత, విశిష్టత ఉంది. గోదావరి నది తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక మండలం గుండాల గ్రామం ద్వారా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం లో అఖండ గోదావరి(గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది.

అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినిలు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.ఈ సప్త గోదావరులు అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి.

2015 గోదావరి మహా పుష్కరంలో సుమారు 4 కోట్ల మంది ప్రజలు పుష్కరాల్లో పాల్గొంటారని అంచనా. ఇంచుమించు 80 లక్షల కుటుంబాలు పుష్కరాల్లో పాల్గొని పునీతులు కానున్నారు. ఈ మహా పుష్కరాల్లో పాల్గొనే భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహాపుష్కరాన్ని పదికాలాలపాటు ప్రజలు గుర్తుంచుకునేలా ఏర్పాట్లు చేశారు.

మహా పుష్కరాల కోసం ప్ఱభుత్వం చేసిన ఏర్పాట్లు, సాంస్క్రతిక, పర్యాటక కార్యక్రమాల గురించి పుష్కరాల కొచ్చే భక్తులకు తెలియచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి మహా పుష్కరం 2015 పేరుతో లఘు పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకం చదివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఆ పుస్తకానికి సంబంధించిన లింక్ ను మీకోసం అందిస్తున్నాం.

NO COMMENTS

LEAVE A REPLY