ఉభయ గోదావరి జిల్లాల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో వెలసిన కోటిపల్లి క్షేత్రం కోటి ఫలాలను ఇచ్చే దివ్యధామం. ఇంద్రుడు, చంద్రుడు శివుడిని పూజించి తమ శాపాలకు విమోచనం సాధించారని చెబుతారు. బ్రహ్మపురాణంలోనూ ఇదే విషయం ఉంది. గోదావరి ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. మూడుకోట్ల శివలింగాలను ప్రతిష్ఠించడం వలన లభించే పుణ్యం … ఈ దివ్య క్షేత్రంలో ఒకసారి స్నానం ఆచరించడం వలన లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీమహావిష్ణువు ధ్యానం

బలి చక్రవర్తి బారి నుంచి దేవతలను కాపాడిన తరువాత శ్రీ మహావిష్ణువు ఇక్కడే ధ్యానం చేసుకున్నాడని చెబుతారు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు ఆయనను దర్శించుకుని తరించారు. పవిత్రమైన ఆ ప్రదేశంలోనే ‘శ్రీ సిద్ధి జనార్ధనస్వామి’ని కశ్యపుడు ప్రతిష్ఠించాడు. ఆ తరువాత కాలంలో అహల్యను మోహించిన దేవేంద్రుడుని సహస్ర యోనులతో సంచరించమని గౌతమ మహర్షి శపించాడు. ఆ శాపం నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని ఇంద్రుడు ప్రాధేయపడటంతో, కోటిపల్లి క్షేత్రంలోని జనార్ధనస్వామిని దర్శించి, కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. దాంతో కోటిపల్లి చేరుకొన్న ఇంద్రుడు కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఫలితంగా ఆయన శరీరంపై ఏర్పడిన సహస్ర యోనులు … సహస్ర నేత్రాలుగా మారిపోయాయి.

చంద్రుడికీ శాపం

ఇక గురువు భార్యను మోహించిన కారణంగా చంద్రుడు కూడా తన సహజ సిద్ధమైన వెలుగును కోల్పోయి వ్యాధి గ్రస్తుడయ్యాడు. పాపపరిహారాన్ని సూచించమంటూ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. కోటిపల్లి క్షేత్రాన్ని దర్శించి పార్వతీ సమేత శివలింగాన్ని ప్రతిష్ఠించి కోటి బిల్వదళాలతో పూజించమని సెలవిచ్చాడు జనార్ధనుడు. ఆయన చెప్పినట్టుగానే చేసి చంద్రుడు పూర్వ వైభవాన్ని పొందాడు. చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఇక్కడి శివయ్యని సోమేశ్వరుడనీ … ఈ క్షేత్రాన్ని ‘సోమతీర్థం’ అని పిలుస్తుంటారు. ఇలా శివకేశవులు కొలువుదీరినందు వలన … దేవాది దేవతల పాద స్పర్శ సోకిన కారణంగా ఈ క్షేత్రం మహా పవిత్రమైంది. మూడుకోట్ల శివలింగాలను ప్రతిష్ఠించడం వలన లభించే పుణ్యం … ఈ దివ్య క్షేత్రంలో ఒకసారి స్నానం ఆచరించడం వలన లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణం లో చెప్పబడిఉంది. ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు,చంద్రుడు, కశ్యపమహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్టించి తన పాపాలు పోగొట్టుకొన్నాడని అంటారు. శ్రీదేవి,భూదేవి సమేతుడైన సిద్ధి జనార్దన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు.

కోటి ఫలి మహా క్షేత్రం

ఈక్షేత్రము పూర్వ కాలంలో కోటి తీర్థం గాను సోమ ప్రభాపురముగాను పిలువబడి, నేడు కోటి ఫలి మహా క్షేత్రముగా ఖ్యాతి గాంచింది. ఇచట గౌతమీ పుణ్య నదిలో విష్ణు తీర్థ, రుద్ర తీర్థ, బ్రహ్మ తీర్థ, మహేశ్వర తీర్థత, రామ తీర్థ మొదలగు అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహిస్తున్న కారణంగా దీనికి కోటి తీర్థ క్షేత్రముగా ప్రఖ్యాతి వచ్చింది. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీగౌతమీ మహాత్మ్యం లో ఈ విధంగా చెప్పబడింది: ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని. ఈ క్షేత్రం లో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు.ఈ ఆలయ ప్రాంగణములో ఉమాసమేత కోటీశ్వరాలయము, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం మరియు భోగలింగము ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయము ముందొక ధ్వజస్తంభము, నందీశ్వరుడు మరియు కొలను ఉన్నాయి. ఈ రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరాలయములో దసరా ఉత్సవములు, కార్తీక దీపోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది.ఈ దేవాలయము లో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణం లో కోటి దీపాలు వెలిగిస్తారు. ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరాలలో కోటిపల్లి ఒకటి.

అర్చకులు ప్రతీరోజు ప్రాతః కాలమందే కోటి తీర్థం నుంచి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తారు. సాయం సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాతన కాలం నుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు. ఆలయం లో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర మండపం లో కాలభైరవ స్వామి మందిరం ఉంది. ఈ దేవాలయం లోనే చంద్రమౌళీశ్వర స్వామి శంకరాచార్యుల మందిరం, ఉమా సమేత మృత్యుంజయ లింగం , నవగ్రహాల గుడి ఉన్నాయి. కోటిపల్లి మహా క్షేత్రము తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలంలో ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమీ నదీ తీరాన ఉంది. కాకినాడ నుంచి బస్సు సౌకర్యముంది. కాకినాడ నుంచి 15 కిలోమీటర్ల దూరం. పవిత్ర గోదావరి తీరాన కోటిపల్లి క్షేత్రం ఉండడం వల్ల వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ శివుడితో పాటు రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ కోటిపల్లి క్షేత్రం దర్శనం సకల పాపాలను హరిస్తుంది. కంచి కామకోటి పీఠాధిపతి, శృంగేరి జగద్గురు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించారు. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా మీరూ ఓసారి దర్శించి ఆ దివ్యానుభూతిని సొంతం చేసుకోండి.

NO COMMENTS

LEAVE A REPLY