గోదావరికి ప్రతి 12 ఏళ్ళకోసారి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి సింహరాశి లోకి ప్రవేశించినపుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. ఆషాడ మాసంలోని చతుర్దశి నాడు పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. గతంలో 2003 జూలై 30నుంచి ఆగస్టు 10 వరకూ గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి. ఈసారి 2015 జూలై 14 నుంచి 2015 జూలై 25 వరకూ పుష్కరాలు నిర్వహిస్తున్నారు.

ఈసారి వచ్చిన పుష్కరాలు సాధారణమయినవి కావు. మహా పుష్కరాలు. ప్రతి 12 పుష్కరాలకు ఒకసారి మహా పుష్కరం వస్తుంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరంలో మనం పాల్గొనడం మన పూర్వజన్మ ఫలంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ మహా పుష్కరం చూసే భాగ్యం మనలో ఎవరికీ కలగకపోవచ్చు. ఎందుకంటే 2159 లో వచ్చే మహా పుష్కరం అది. దీన్ని బట్టి ఈ మహా పుష్కరాలకు ఎంతటి ప్రాధాన్యత, విశిష్టత ఉందో అర్థం చేసుకోవచ్చు. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది.

పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు.

గోదావరి పుష్కరాలకున్న పౌరాణిక ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు పుష్కరం అంటే ఏంటి? పుష్కరాలకు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? గోదావరి పుష్కరాల్లో మనం ఏం చేయాలి? ఈ సందేహాలను తీరుస్తుంది గోదావరి పుష్కరాల సంక్షిప్త పరిచయం పుస్తకం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రచురించిన ఈ పుస్తకం పుష్కర యాత్రీకులకు అందుబాటులో ఉంది. ఈ పుస్తకం చదివి తమ సందేహాలను తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

NO COMMENTS

LEAVE A REPLY