పశ్చిమగోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణం. లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం. రెవిన్యూ డివిజన్ నరసాపురం. వశిష్ట గోదావరి ఒడ్డున ఉన్న ప్రధాన పట్టణాల్లో ఒకటి నరసాపురం. రాష్ట్ర విభజన అనంతరం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం నరసాపురంలో మైనర్ పోర్టు, ఫిషింగ్ హార్బర్ నెలకొల్పుతామని ప్రకటించింది.

డచ్ వర్తకుల పాలనా కాలం నుంచి నరసాపురం వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది.నరసాపురం రోజురోజుకీ బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నరసాపురం జనాభా 70 వేలు దాటిపోయింది. సముద్రానికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండడంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల రాకపోకలతో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. చేపలు, కొబ్బరి ఎగుమతులకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. చించినాడ దగ్గర బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. కోనసీమ లోని ప్రాంతానికి నరసాపురం నుంచి రాకపోకలు బాగా పెరిగిపోయాయి. దీంతో రాజమండ్రి, రావులపాలెంపై వత్తిడి తగ్గిందనే చెప్పాలి.

చరిత్ర

క్రీస్తుపూర్వం 1173 నుంచి నరసాపురం గురించిన ప్రస్తావన ఉంది. 1626 లో డచ్ వారు నరసాపురానికి వచ్చినట్టు చరిత్ర చెబుతోంది. డచ్ వారు నరసాపురాన్నివ్యాపార కేంద్రంగా ఉపయోగించారు. ఓడలు, నౌకలు ఇక్కడినుంచి సరుకులను ఇతర దేశాలకు రవాణా చేసినట్టు తెలుస్తోంది. డచ్ వారు, ఆతర్వాత ఫ్రెంచివారు అనంతరం బ్రిటిష్ వారు నరసాపురంపై పట్టు సాధించారు. 1759 లో ఫ్రెంచివారు ఆధిపత్యం కనిపించింది. షిప్ ల తయారీకి నరసాపురం కేంద్రంగా మారింది.

16వ శతాబ్ధంలో పోర్సుగీసు వారు ఇక్కడ ఓ ఫ్యాక్టరీని నిర్మించారు. 18 వ శతాబ్ధంలో నరసాపురం ఒక ప్రధాన ఓడరేవుగా అభివృద్ధి చెందింది. టేకు కలపను ఇక్కడినుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. కాకినాడతో పాటు నరసాపురం పోర్టులు ఓడల తయారీకి కేంద్రబిందువులుగా చెబుతారు. అయితే ప్రస్తుతం ఇక్కడ పోర్టు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మైనర్ పోర్టు కట్టాలని నిర్ణయించింది. నరసాపురం సమీపంలోని మాధవాయపాలెం ఒకప్పుడు వస్త్ర్ర పరిశ్రమకు ఆలవాలంగా ఉండేది. 1827 లో కంపెనీ ఫ్యాక్టరీని మూసివేయడంతో గత వైభవంఅంతా అంతర్ధానమైంది. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారు నరసాపురం ప్రాంతాన్ని ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా నిర్మించారు. ఇప్పుడు స్టీమర్ రోడ్డుగా పిలిచే వలంధర్ రేవులో స్టీమర్లు వచ్చేవి.

శివాలయం

నరసాపురంలోని లక్ష్మణేశ్వరంలో ప్రముఖ శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని రాముడి సోదరుడు లక్ష్మణుడు నిర్మించాడని చెబుతారు. సీతను వెదకడానికి రాముడు లంకకు వెళ్ళేందుకు ఈ మార్గంలోనే వెళ్ళాడని, ఆ సమయంలోనే లక్ష్మణుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు. మహాశివరాత్రి సంబరాలు ఇక్కడ అంబరాన్ని అంటుతాయి.

శ్రీ ఆదికేశవ ఎంబెరుమన్నార్ స్వామి ఆలయం

నరసాపురంలో ఉన్న ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో ముఖ్యమయినది. మూడు వందల ఏళ్ళ క్రితం శ్రీ పుప్పాల రమణప్పనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలనా కాలంలో ఆయన అనువాదకుడిగా పనిచేశారు. తమిళనాడులోని భూతపురి ఆలయ నమూనాను ఇది పోలి ఉంటుంది. అందుకే దీనికి అభినవ భూతపురిగా పేరుంది.

సంస్కృతి

ఈ ప్రాంతం స్వతహాగా హైందవ సంప్రదాయంతో కొనసాగుతుంటుంది. అయితే 18 వ శతాబ్ధంలో ఇక్కడ లూథరన్ మిషనరీ కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. ఇక్కడ క్రిస్టియన్ జనాభా ఎక్కువగా ఉన్నారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా ఇక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది.ఈ ప్రాంతం పుష్కర యాత్రీకులతో కిక్కిరిసి పోతుంటుంది. విదేశాల్లో ఉన్న ఈప్రాంతం వారు పుష్కరాలకు తరలి వస్తారు. విదేశీయులు కూడా గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు.గోదావరి మహా పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే వారు ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం నర్సాపురం జనాభా సుమారు 60 వేలు. అక్షరాస్యతలో భారతదేశంలోనే ప్రముఖ స్థానంలో ఉంది. ఇక్కడ అక్షరాస్యత 75 శాతంగా నమోదైంది. జాతీయ సగటు కేవలం 60 శాతం మాత్రమే.

పర్యాటక ప్రాంతాలు

నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబెరుమన్నార్ స్వామి ఆలయం ప్రముఖ పర్యాటక, ఆధ్మాత్మిక కేంద్రంగా చెప్పుకోవాలి. ఈ ఆలయాన్ని1786 లో నిర్మించారు. దీంతో పాటు దుర్గా లక్ష్మణేశ్వరంలోని లక్ష్మణేశ్వరస్వామి ఆలయం, పేరుపాలెం బీచ్ ప్రధాన ఆకర్షణలు. నరసాపురం టౌన్ కి 20 కిలోమీటర్ల దూరంలో పేరుపాలెం బీచ్ ఉంది. ఈ బీచ్ కు రోజూ వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. నరసాపురం ప్రాంతానికి సమీపంలోనే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. సాగర సంగమం, అన్నాచెల్లెలి గట్టు ఇక్కడికి సమీపంలోనే ఉంది. గోదావరి నది సముద్రంలో సంగమించే ప్రాంతం ఇది. చూసి తీరాల్సిన పర్యాటక ప్రాంతం ఇది. ఇక్కడే గతంలో నరసాపురం లైట్ హౌస్ ఉండేది. వీటితో పాటు రివర్ రోడ్డులో బాపు ప్లాటఫారం, బోట్ ఫెర్రీ, బాలయోగి పార్కు ఉన్నాయి.

రవాణా సదుపాయాలు

నరసాపురం పశ్చిమగోదావరి జిల్లాలో రైల్వేశాఖకు చివరి టెర్మినల్ స్టేషన్. హైదరాబాద్ కు వెళ్ళడానికి ఇక్కడినుంచి నరసాపూర్ ఎక్స్ ప్రెస్ ని 1979లోనే ప్రవేశపెట్టారు. దీంతో పాటు నాగర్ సోల్ నరసాపూర్ ఎక్స్ ప్రెస్ కూడా ప్రతిరోజూ తన రాకపోకలు సాగిస్తోంది. నరసాపురం నుంచి విశాఖ వెళ్ళేందుకు సింహాద్రి ఎక్స్ ప్రెస్,
తిరుపతి కి తిరుపతి ఎక్స్ ప్రెస్, విజయవాడకు పాసింజర్, విశాఖపట్నానికి ఒక పాసింజర్, రాజమండ్రికి రెండు పాసింజర్లు, గుంటూరు కి రెండు పాసింజర్లు, నిడదవోలుకి పాసింజర్, గుడివాడకు పాసింజర్, భీమవరం పాసింజర్ నడుస్తున్నాయి. తాజా నర్సాపురం నుంచి బాపట్ల, వయా మచిలీపట్నం మీదుగా కొత్త లైన్ ప్రతిపాదనలో ఉంది. అలాగే కోటిపల్లి నుంచి నర్సాపురం లైన్ కి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు బ్రిడ్జిల నిర్మాణానికి 1,500 కోట్లు విడుదలచేశారు.నరసాపురంలో ఉన్న రైల్వే డిపో 8 ఎక్ప్ ప్రెస్ రైళ్ళు, 9 పాసింజర్ రైళ్ళ నిర్వహణకు వినియోగిస్తున్నారు.

రోడ్డు మార్గం

ఏపీఎస్ ఆర్టీసీ నరసాపురం నుంచి రాష్ట్ర్రంలోని ప్రధాన నగరాలకు బస్సులు నడుపుతోంది. ఇక్కడ బస్సు డిపోనుంచి ప్రధాన నగరాలకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. 214 ఎ జాతీయ రహదారి నరసాపురంలో ప్రారంభమై ఒంగోలు దగ్గర ఎన్ హెచ్ పైలో కలుస్తుంది. దీనివల్ల కలకత్తా-చెన్నై రహదారిపై దూరం బాగా తగ్గుతుంది.

ఆర్థికవనరులు

నరసాపురం లేసు ఉత్పత్తులకు కేంద్రస్థానం. అమెరికా, యూరోప్, జపాన్ దేశాలకు 50 మంది ఎగుమతిదారులు తమ లేసు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. వీటి ద్వారా 2 లక్షలమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఈ ఉత్పత్తుల ద్వారా ఏడాది రూ.40 కోట్లు విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. కేంద్ర టెక్స్ టైల్ శాఖ కూడా లేసు ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తోంది. గోదావరి డెల్టా విమెన్ లేస్ ఆర్టిజాన్స్ సొసైటీని నరసాపురంలో ఏర్పాటుచేశారు. వందేళ్ళ క్రితమే ఈ సంస్థ పనిచేసింది. ఎంతోమంది నిరుపేద మహిళలు లేసు పరిశ్రమలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు సంప్రదాయ బంగారు ఆభరణాల తయారీకి పెట్టింది పేరు నరసాపురం. జైన్ జ్యూయలర్స్, జీవాజీ గోల్డ్, రాజేంద్ర జ్యూయలర్స్ వంటి అనేక జ్యూయలరీ కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయి.

పరిశ్రమలు

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ONGC)
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్ (CISF)
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CMFRI)
పాన్ గోదావరి హేండీ క్రాప్టు
కాంప్నహెన్సివ్ హేండీ క్రాప్టు క్లస్టర్ డెవలప్ మెంటు స్కీమ్ (CHCDS)
కేంద్ర వాతావరణ శాఖ ఆధ్వర్యంలోని ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ (AWS)

NO COMMENTS

LEAVE A REPLY