అలనాటి రాజమహేంద్రవరమే నేటి రాజమండ్రి. చారిత్రక, సంప్రదాయ, సాంస్కృతిక వారసత్వ సంపద రాజమండ్రి సొంతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే రాజమండ్రి అతి పురాతన మయిన నగరం.ఇటు విజయవాడ, అటు విశాఖపట్నం నగరాలకు కేంద్రస్థానంలో ఉంది రాజమండ్రి.

గోదావరి పుష్కరాల్లో ప్రధాన కేంద్రం రాజమండ్రే. లక్షలాది మంది భక్తులు ప్రతిరోజూ రాజమండ్రిలోని గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. ఆసియాలోనే అతి పెద్దదయిన రైల్ కం రోడ్డు బ్రిడ్జి ఇంజనీరింగ్ అద్భుతానికి మెచ్చుతునక. తెలుగు భాష ఇక్కడే పుట్టిందంటారు. ఆది కవి నన్నయ్య ఇక్కడే తెలుగు భాషకు పునాది వేశారు. తెలుగులో మొదటి కవిగా వినుతికెక్కారు. ఆయన పేరు మీద ఇక్కడ నన్నయ్య విశ్వవిద్యాలయం స్థాపించారు.

పర్యాటక ప్రాంతాలు

రాజమండ్రికి ప్రధాన ఆకర్షణ ఇక్కడ గలగల పారే గోదావరి. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ మూడు బ్రిడ్జిలు నిర్మించారు. మానసిక ఆనందానికి, పుణ్య స్నానాలు ఆచరించేందుకు, పాపపరిహారానికి ఇక్కడికి వచ్చి వేలాదిమంది పుణ్యస్నానాలు చేస్తుంటారు. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు, భక్తులు వచ్చి గోదావరి అందాలకు ముగ్ధులవుతారు. పుష్కరాల సందర్భంగా గోదావరి సమీపంలో పుష్కర ఘాట్లను నిర్మించింది ప్రభుత్వం.

రాజమండ్రిలో హైందవ సంప్రదాయానికి చెందిన ఎన్నో ఆలయాలున్నాయి. ఇక్కడ శివ, కేశవులకు బేధం లేదు. కోటిపల్లిలో ఉన్న కోటిలింగాల ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పుణ్య గోదావరిలో స్నానమాచరిస్తే తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గతంలో 2003 ఆగస్టులో పుష్కరాలు వచ్చాయి. అప్పుడు 34 లక్షలమంది భక్తులు స్నానాలు చేశారు. ఇస్కాన్ ఆలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. గౌతమి ఘాట్ లో యువకులు ఎక్కువగా సేదతీరుతుంటారు.

సర్ ఆర్ధర్ కాటన్ మ్యూజియం

కాటను దొర చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వంవారు ఆయనపేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంను ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్‍దొర ఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడినది. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి. మ్యూజియం ఆవరణమీదుగా,మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారియొక్క ఫ్లైఒవర్ వంతెన ఉన్నది. ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు, రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు ఫిరంగులు ఉన్నాయి.మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరినది రాజమండ్రి నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి.

బోట్ ప్రయాణం

గోదావరి అందాలు చూడాలంటే బోట్ ప్రయాణానికి మించిన ఆహ్లాదకరమయింది లేదు. రాజమండ్రి నుంచి భద్రాచలం వయా పాపికొండల మీదుగా బోట్ షికారు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీంతో పాటు జిల్లాలోని కొల్ల్లూరు, పోలవరం ప్రాజెక్టు, దేవీ పట్నం,పేరంటాల పల్లి చూడదగినవి. పట్టిసీమ రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎన్నో సినిమాల షూటింగులు జరిగాయి. పట్టిసీమలో ఆలయం చూసి తీరాల్సిందే. దిండి రిసార్టులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మారేడుమిల్లి అడవులు చూసి తీరాల్సిందే. రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ అడవులు ఉన్నాయి. పర్యాటకులు ఇక్కడికి అధిక సంఖ్యలో వెళుతూ ఉంటారు.

చిత్రాంగి రిసార్ట్, రివర్ బే రిసార్ట్, ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్, శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, కందుకూరి రాజ్యలక్ష్మి గార్ల సమాధులు, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ, గౌతమీ లైబ్రరీ, ఆర్యభట్ట సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీ, రాళ్ళబండి సుబ్బారావు ఆర్కియలాజికల్ మ్యూజియం, కంబాల పార్కు ముఖ్యమైన చూడదగ్గ ప్రదేశాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాజమండ్రి జనాభా 3లక్షల యాభై వేలు.అక్షరాస్యత 84 శాతం.

ఆర్థిక వనరులు

రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య రాజధానిగా చెప్పుకోవాలి. వస్త్ర పరిశ్రమతో పాటు బంగారు ఆభరణాల తయారీ కూడా భారీగా సాగుతుంది. కో ఆపరేటివ్ హ్యాండ్లూమ్ ద్వారా రాజమండ్రిలో రోజూ కోట్లాదిరూపాయల రెడీమేడ్ వస్త్ర్రాల అమ్మకాలు జరుగుతున్నాయి. వీటికి తోడు వందలాది బులియన్ వర్తకులు ఇక్కడ తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాడితోటలో మహాత్మాగాంధీ హోల్ సేల్ క్లాత్ మార్కెట్, దేవీ చౌక్, ఫోర్టు గేట్ లో వస్త్రదుకాణాలున్నాయి.

రాజమండ్రి సెంట్రల్ జైలు

రాజమండ్రిలో సందర్శించవలసిన ప్రదేశాలలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఒకటి. సెంట్రల్ జైలు కంభాల చెఱువు నుండి తిన్నగా వై-జంక్షన్ వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రభుత్వ కళాశాల(ఆర్ట్స్ కాలేజి) ఎదురుగా 100 మీటర్ల దూరంలో ఉన్నది. ఇది మెదట్లో ఒక కోట. దీనిని 2-3 శతాబ్ధాల క్రితం భారత దేశానికి వర్తకం చెయ్యడానికి వచ్చిన డచ్ వారు నిర్మించారు. తరువాత ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలో కారాగారం క్రింద మార్చబడింది. 1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంట్రల్ జైల్ స్థాయి కల్పించబడింది. ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఈ జైలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు.

రవాణా సదుపాయాలు

రాజమండ్రి చెన్నై-కలకత్తాని కలిపే ఎన్ హెచ్- 5 మీద ఉంది. రాజమండ్రి నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉన్నది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. నగరంలో ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయంతో కలిపి, గోకవరం, కోటిపల్లి హైటెక్ బస్టాండ్ ఉన్నాయి.

రాజమండ్రి బస్టాండ్

రాజమండ్రి బస్సు కాంప్లెక్స్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు, పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన కాకినాడ, తుని, అన్నవరం, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు,గుంటూరుకి బస్సు సర్వీసులు ఉన్నాయి.

కోటిపల్లి బస్టాండు

కోటిపల్లి బస్టాండు పాల్ చౌక్ వద్ద ఉంది. గోదావరి రైలు రోడ్డు వంతెన దిగి రాజమండ్రిలో ప్రవేశించిన వేంటనే ఈ బస్టాండు వస్తుంది. ఈ బస్టాండులో రాజమండ్రి రైలు స్టేషను మీదుగా ధవళేశ్వరం వైపుగా రావులపాలెం, అమలాపురం మండపేట, రామచంద్రపురం, ద్రాక్షారామం, కొటిపల్లి వెళ్ళే ఆర్.టి.సి.బస్సులు, రైలు రోడ్డు వంతెన మీదుగా కొవ్వూరు, నిడదవోలు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు వెళ్ళే ఆర్.టి.సి. బస్సులు ఆగుతాయి. ఈ మధ్యకాలంలో ఐ.టి.సి వారి సహాయంతో ఈ బస్టాండుని ఆధునీకరించారు.

గోకవరం బస్టాండు

గోకవరం బస్టాండ్ లో ప్రస్తుతం రాజమండ్రి లో విలీనం చేస్తున్న పరిసర గ్రామాలూ ఐన కోరుకొండ గాడాలా,కొంతమురు, గోకవరం ఇతర ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులు మరియు ప్రైవేటు బస్సు నిలుస్తాయి. ఈ బస్సు నిలయం గోదావరి రైలు స్టేషను కి ఆవతల, రాజమండ్రి నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్నది. ఈ బస్సు స్టేషను నుంచి వెళితే దేవి చౌక్, కంభాల చెరువు వస్తుంది.

గోదావరి రైల్వే స్టేషను

రాజమండ్రి చెన్నై-కలకత్తా ప్రధాన రైలు మార్గములో వచ్చే ప్రధాన రైలుస్టేషను. గోదావరి మీద ఉన్న రైలు వంతెన వల్ల రాజమండ్రి భారత దేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. మెదటిది గోదావరి రైలు స్టేషను. రెండవది రాజమండ్రి రైలు స్టేషను. గోదావరి నది మీద మెదటి రైలు వంతెన. దీన్ని హేవలాక్‌ వంతెన అంటారు. ఇది 1900 నిర్మించబడినప్పుడు గోదావరి రైలు స్టేషను నిర్మించారు. తరువాతి కాలంలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో రైల్వే లైను సౌలభ్యం కోసం రైలు రోడ్డు వంతెన నిర్మాణం జరిగింది. 19890-1995 సంవత్సరాల మధ్య మూడవ రైలు వంతెన నిర్మాణం జరిగింది.

వంతెన మూసివేత

ఈ రైలు వంతెన కొవ్వూరు నుంచి బయలు చేరి గోదావరి స్టేషను వద్ద ముగుస్తుంది. ఈ రైలు వంతెన పై చివరి సారి 1996లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ని నడిపి ఈ రైలు వంతెనని మూసి వేసి రైల్వేశాఖ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది. మూడవ రైలు బ్రిడ్జి నిర్మాణం జరిగాక గోదావరి రైలుస్టేషను కొద్దిగా గోకవరం బస్టాండు వైపు ప్రక్కకు జరపబడింది. 2003 పుష్కరాల సమయంలో ఈ స్టేషను ఆధునీకరించబడింది. ఈ స్టేషను మీదుగా కొవ్వూరు నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్ళు వెళ్తాయి కాని ప్యాసింజర్లు మాత్రమే నిలుస్తాయి. రాజమండ్రి నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి.విజయవాడ వైపు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ రైళ్ళు రెండవ రైలు వంతెన మీదుగా వెళ్తాయి.

రాజమండ్రి రైలు స్టేషను

రెండవ రైల్వే లైను సౌకర్యార్థం రోడ్డు రైలు వంతెన నిర్మాణం జరిగాక రాజమండ్రి రైల్వేస్టేషను నిర్మించారు. కోస్తా జిల్లాలలో విజయవాడ-విశాఖపట్టణం నగరాల మధ్యనున్న ముఖ్య రైలు స్టేషను. ఈ స్టేషను లో అన్ని రైలు బండ్లు ఆగుతాయి.

విమాన సౌకర్యం

నగర శివార్లలో ఉన్న మధురపూడిలో బ్రిటీష్ వారు నిర్మించిన పాత రాజమండ్రి విమానాశ్రయము ఉంది. ఈ మధ్యనే భారత విమానయాన సంస్థ నూతన టెర్మినల్ మరియు భవనాలను నిర్మించి జాతీయ విమానశ్రయమునకు దీటుగా నిర్మించారు ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వెస్ మరియు స్పైస్ జెట్ వారు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలను నడుపుతున్నారు.

జలరవాణా సౌకర్యాలు

రైలు వంతెన మరియు రోడ్డు వంతెన వచ్చాక జల రవాణా మీద ప్రజలు ఆధారపడడం లేదు. కాని జలరవాణా పర్యాటక రంగం ఊపందనుకోవడం వల్ల మళ్ళీ జీవము వస్తున్నది. ఇక్కడ నుండి పాపి కొండలకు, భద్రాచలం మరియు పట్టిసీమకు లాంచీ సదుపాయం ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా లాంచీలు నడుపుతున్నారు.తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జలరవాణా ను ప్రోత్సహించాలని నిర్ణయించాయి. దీని ద్వారా కాలుష్యం, రవాణా వ్యయం తగ్గడమే కాదు ఎంతో ఇంధనం ఆదా అవుతుంది.

ప్రముఖ వ్యక్తులు

రాజమండ్రికి ఖ్యాతి తెచ్చిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. వారిలో కందుకూరి వీరేశలింగం పంతులు, డా.ఎ బి నాగేశ్వర రావు, దామెర్ల రామారావు, విశ్వనాథం సుందరశివరామ శర్మ, ఆదుర్తి సుబ్బారావు, మద్దూరి అన్నపూర్ణయ్య, న్యాపతి సుబ్బారావు పంతులు, పింగళి సూరన్న, నన్నయ్య భట్టు, మధిర సుబ్బన్న దీక్షితులు, కందుకూరి వీరేశలింగం, భమిడిపాటి కామేశ్వర రావు, కల్లూరి వేంకట రామ శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి , వావిలాల వాసుదేవ శాస్త్రి ముఖ్యులు.

NO COMMENTS

LEAVE A REPLY