గోదావరి మహా పుష్కరాల వేళ రాజమండ్రికి చెందిన ప్రముఖ చిత్రకారుడు దామెర్లను తలుచుకోవడం సముచితం. సందర్బోచితం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో 1897 మార్చి 8వ తేదీన ప్రముఖ వైద్యుడు దామెర్ల వెంకట రమణారావు, లక్ష్మీదేవిలకు రెండవ కుమారుడుగా ఈయన జన్మించాడు. చిన్నతనం నుంచీ రామారావుకి చిత్రకళ పట్ల అమితమైన అభిరుచి ఉండేది. రామారావు మేనమామ పాఠశాలలో డ్రాయింగు టీచరు. అన్నివేళలా ఆయనతో ఉండటం వలన రామారావుకి కూడా చిత్రలేఖనం మీద మనసు మళ్ళింది. ఆరేళ్ళ వయసునుంచి గోడమీద బొగ్గుతో బొమ్మలు, ఆపైన తెల్ల కాగితాల మీద వేయటం ప్రారంభించాడు. మేనమామ ప్రోత్సాహంతో పదేళ్ళవయసుకి చక్కని ప్రకృతి రమణీయ దృశ్యాలు గీసేవారు. వీటిద్వారా అందరి అభినందనలు అందుకున్నారు. కొబ్బరితోటల్లో కూర్చుని, గోదావరిగట్టు మీద కూర్చుని, లాంచీలో తిరుగుతూ ఒకటేమిటి? అనేక ప్రకృతి దృశ్యాలను ఆయ‌న చిత్రించాడు.

పదేళ్లనుంచే చిత్రకళపై ఆసక్తి

Damerla Ramaraoఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవి, చిత్రకారుడు. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు, కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి పంపాడు. 1916 లో రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె. స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్‌లోని లోని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కళాశాల సంచాలకుడైన సిసిల్ బర్న్స్ రామారావు రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఆ కళాశాలలో నేరుగా మూడో సంవ‌త్స‌రంలో చేర్చుకొన్నాడు. మొదట్లో ఆ కాలేజిలో ఆతన్ని మద్రాసీ అని చిన్న చూపు చూసినా, అతను వేసిన చిత్రాలు చూసి మెచ్చుకున్నారు.

అమాయ‌క‌త్వం నుంచి అద్భుత ప్ర‌తిభ

అమాయకంగా ఉండే ఈ వ్యక్తిలో ఇంతటి సృజనాత్మకత ఉందా? అని అందరూ ఆశ్వర్యపోయారు. ఆనాటి నుంచి తిరుగులేని చిత్రకారుడు అయ్యాడు. చివరి సంవత్సరంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై మేయో బంగారు పతకాన్ని Damerla Ramarao Paintingరామారావు అందుకున్నాడు. వెంటనే చిత్రకళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది. అయితే అది ఆయనకు ఇష్టంలేదు. తాను పుట్టిపెరిగిన రాజమండ్రికి తిరిగివచ్చాడు. 1922 లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన ‘ఋష్యశృంగ బంధనం’ చిత్రానికి ప్రథమ బహుమతిగా ‘వైస్రాయి ఆఫ్ ఇండియా’ పతకం వచ్చింది. అంతేకాకుండా అప్పటి వైస్రాయి లార్డ్ రీడింగ్ రామారావును స్వయంగా పరిచయం చేసుకొని ఆయన వేసిన చిత్రాల్లో ఒకదాన్ని కొన్నాడు.

రామారావు చిత్రించిన గొల్లపడుచు, గోదావరి లోయ, పుష్పాలంకారం, ద్రోణుడు, సిద్ధార్థుని రాగోదయం,బావి దగ్గర, భరతవంశపు రాకుమారులు, కైకేయీ దురాలోచన, నంది పూజ, పేరంటము, గొల్లపడుచులు, కార్తీక పౌర్ణమి వంటి రామారావు చిత్రాలు దేశ, విదేశాలలో ఎన్నో ప్రశంసలు పొందాయి. 1923లో దామెర్ల రామారావు చిత్రించిన అసాధారణ అత్యద్భుత చిత్రమే ఈ పుష్పాలంకరణ. తన భార్యకు జరిగిన సీమంతం ను చూసి తన రచనా పాటవముతో చిత్రించాడు.రూపు రేఖా విలాసాలను, ఆనాటి స్త్రీలకు తగిన వస్త్రధారణా విధానమును, పేరంటాలకు జరుగు పన్నీటి జల్లులు , అమ్మలక్కల కాలక్షేపపు ముచ్చట్లు , కూర్చునే వివిధ పద్ధతులు ఇటువంటి ఎన్నో విశేషాలు ఈ చిత్రము ద్వారా మనకు కనిపిస్తాయి.ఇదే ఆయన చిత్రీకరణలోని ప్రత్యేకత.

గ్రామీణ సంస్కృతికి దర్పణాలు

Parakala Visiting Damerla Ramarao Galleryగ్రామీణ వాతావరణ చిత్రీకరణకు రామారావు పెట్టింది పేరు. గ్రామాలలో ఊరుమ్మ‌డి మంచి నీటి గిలక బావుల వద్ద ఓ ఉదయపు దృశ్యాన్ని ఆయన కుంచెద్వారా మనముందు సాక్షాత్కరించారు. బావులవద్ద ఆనాటి స్త్రీలు చేదతో నీటిని తోడడం, నడుముపై నీటి బిందెలు ఎత్తుకొని నడచి వెళ్లడం, స్త్రీల నడవడిక , నిలుచునే విధానము, బిందెలు భూజాన పెట్టుకున్న స్త్రీల సహజత్వం, వివిధ వ్యక్తుల వివిధ భంగిమలు, విశ్వవిఖ్యాత చిత్రకారులతో సరితూగగల ప్రతిభ , నైపుణ్యం దామెర్ల దని నిరూపించే చిత్రాలు ఎన్నో.

భారతీయ చిత్రకళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన విఖ్యాత చిత్రకారుడు దామెర్ల రామారావు దేశం గర్వించదగిన కళాకారుడు. గొల్లభామల ఇతివృత్తంతో వాటర్ కలర్స్ తో గీసిన వర్ణచిత్రం నేటి త్రీడీ చిత్రాలకంటే అద్భుతంగా వున్నది. ఇంటి గుమ్మం ముందు నిల్చున్న స్త్రీమూర్తి చిత్రం చాలా నచ్చింది. బావిదగ్గర, పేరంటం చిత్రాలు నాటి స్ర్తీ మూర్తుల వేషధారణ, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబించాయి. దామెర్ల రామారావు ఆర్టు గ్యాలరీలో చిత్రాలు మనసు దోచేవిగా వుంటే, చిత్రకళా ప్రదర్శన శాల దుస్థితి  నన్ను  కలచివేసింది. ఆర్టు గ్యాలరీ పరిస్థితిని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, కళాప్రదర్శన శాలను మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను.

– ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్

ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. వారు ఆతన్ని తమ ఆస్థానానికి పిలిచి ఘనంగా సత్కరించారు. కోల్ క‌తా , బొంబాయి వంటి మహానగరాల్లో జరిగిన బ్రిటీషు ఎంపైర్ ప్రదర్శనశాలలో దామెర్ల చిత్రాలను చూసి విదేశీయులు విస్తుపోయారు. ఆ బొమ్మలను ఏడాది పాటు అక్కడి గ్యాలరీలో ఆయన బొమ్మలుంచారంటే అతని చిత్రకళా ప్రతిభకు తార్కాణం.

1923 లో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను స్థాపించి అనేక మంది యువకులకు శిక్షణను ఈయన ఇచ్చాడు. 1925 లో 28 ఏళ్ళకే ఆయన అకాల మరణం చెందాడు. ఈయన చిత్రాలను రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీ లో భద్రపరచారు. ఆ కీర్తిశేషుని పేర ఒక చిత్రకళామందిరం వెలసింది. అందులో ఆయన వేసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్ర‌తిరోజూ వేలాదిమంది క‌ళా పిపాసులు ఆర్ట్ గ్యాల‌రీని సంద‌ర్శించి , రామారావు ప్ర‌తిభ‌ను వేనోళ్ళ పొగుడుతున్నారు. ఎల్లలెరుగ‌ని ప్ర‌తిభ‌తో అకాల‌మ‌ర‌ణం పొందిన దామెర్ల రామారావు క‌ళాపిపాసులు హృద‌యాల్లో చిర‌కాలం కొలువై ఉంటారు. ఆయ‌న మ‌న రాజ‌మండ్రి వాసి కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం.

NO COMMENTS

LEAVE A REPLY